
Railways: రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట.. ఇకపై అన్ని కోచ్‌లు, లోకోమోటివ్‌లలో సిసిటివి కెమెరాల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో విస్తృతమైన, సమగ్ర ప్రణాళికను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 74,000 ప్యాసింజర్ బోగీల్లో, 15,000 సరుకు రవాణా లోకోమోటివ్‌ల్లో ఆధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా కూడా అత్యుత్తమ నాణ్యత గల దృశ్యాలను ఈ కెమెరాలు అందించగలవని పేర్కొన్నారు. ఈ మౌలిక ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపర్చడమే కాకుండా, రైళ్లలో జరిగే నేరాల నివారణ కూడా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
4 డోమ్ టైప్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
ఈ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రయాణికుల భద్రతను గణనీయంగా పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. రైళ్లలో వస్తువుల దొంగతనాలను అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవడం వంటి ముఖ్య ఉద్దేశాలతో ఈ కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ప్రయాణికులు మరింత సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో ప్రయాణించగలరని అధికారులు తెలిపారు. ప్రతి ప్యాసింజర్ బోగీలో ప్రయాణికుల గోప్యతను కాపాడుతూ, ఎక్కువగా కదలికలు ఉండే ద్వారాల వద్ద 4 డోమ్ టైప్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ప్రవేశ మార్గం వద్ద రెండు కెమెరాలు ఉంటాయి. ఇక ప్రతి లోకోమోటివ్‌లో 6 సీసీటీవీ కెమెరాలను వ్యూహాత్మకంగా అమర్చనున్నారు.
వివరాలు
కెమెరాలు అన్ని STQC సర్టిఫికేషన్ పొందిన అత్యాధునిక సాంకేతికతతో తయారైనవి
అందులో లోకోమోటివ్ ముందు, వెనుక భాగాల్లో ఒక్కో కెమెరా, రెండు వైపులా డోమ్ కెమెరాలు, డ్రైవర్ క్యాబిన్‌లో డ్రైవర్ చర్యలను పర్యవేక్షించేందుకు రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలు అన్ని STQC సర్టిఫికేషన్ పొందిన అత్యాధునిక సాంకేతికతతో తయారైనవిగా ఉంటాయి. తక్కువ వెలుతురు లేదా అధిక వేగంతో రైలు ప్రయాణిస్తున్నా కూడా ఈ కెమెరాలు స్పష్టమైన దృశ్యాలను రికార్డ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
వివరాలు
భారతీయ రైల్వే భద్రతా రంగంలో మరొక మెట్టు ముందుకు
ఈ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసే ముందు,ఉత్తర రైల్వే పరిధిలోని కొన్ని ఎంపికైన బోగీలు, లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చి విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు సానుకూల ఫలితాలు చూపించడంతో, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో విశ్లేషించాలన్న సూచనను కూడా ఆయన చేశారు. ఇండియా ఏఐ మిషన్ సహకారంతో అసాధారణ పరిస్థితులను గుర్తించి, తక్షణమే భద్రతా చర్యలు తీసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా భారతీయ రైల్వే భద్రతా రంగంలో మరొక మెట్టు ముందుకెళ్లనున్నదని వారు భావిస్తున్నారు.