
Ahmedabad Plane Crash: విమానంలో ఎలాంటి యాంత్రిక సమస్యలు లేవు.. ఎయిరిండియా సీఈవో ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి యాంత్రిక లోపాలు లేవని స్పష్టంచేశారు. ఇంజిన్‌లో గానీ, స్విచ్‌ల్లో గానీ నిర్వహణ సమస్యలు ఏవీ లేనట్లు నివేదికలో తేలినట్టు పేర్కొన్నారు. బోయింగ్ విమానం పూర్తిగా భద్రమైనదని చెప్పారు. ఇంధన స్విచ్‌ల గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని తేల్చిచెప్పారు. ఆ స్విచ్‌లు రెండు సార్లు మార్పు చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, అవి సురక్షితంగా ఉన్నాయని అమెరికాకు చెందిన సంస్థ ధృవీకరించిందని తెలిపారు. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత ఇంధనానికి సంబంధించిన రెండు స్విచ్‌లు ఏ కారణంగా ఆపివేయబడ్డాయన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
vivaralu
ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది..
అదే సమయంలో రెండు ఇంధన స్విచ్‌లు ఆపివేయబడటంతో ఇంధన సరఫరా ఆగిపోయిందని, దీంతో కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో విమానం ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయిందని వివరించారు. అదే సమయంలో, లండన్‌కు బయల్దేరే ముందు ఇద్దరు పైలట్లకు శ్వాస పరీక్షలు నిర్వహించామని, ఆ పరీక్షల్లో వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అయితే, ఇతర వైద్య పరీక్షలు మాత్రం జరగలేదని సమాచారం. ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, అసత్య కథనాలు ప్రచురించొద్దని విల్సన్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగే కొన్ని రోజుల ముందు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశామని, వాణిజ్య సేవలకు అనుకూలంగా ఉందని నిర్ధారించిన తరువాతే ప్రయాణానికి వినియోగించినట్లు వెల్లడించారు.
వివరాలు
పైలట్ ఆత్మహత్య వార్తలపై తీవ్ర ఆవేదన
ప్రతి విమానాన్ని పరిశీలిస్తున్నామని, ఏవైనా కొత్త మార్గదర్శకాలు వచ్చినా వాటిని పాటిస్తూ ఉంటామని తెలిపారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న కమిటీలో తానూ సభ్యుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతర అంశాల్లో, ఈ ప్రమాదానికి పైలట్ ఆత్మహత్యే కారణమని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించగా, వాటిని పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. చనిపోయిన పైలట్లను దూషించకుండా, ఊహాగానాలకు తావిచ్చేయొద్దని పేర్కొంటూ, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశాయి. ఎవరినీ బలిపశువులుగా మార్చొద్దని స్పష్టం చేశాయి. పైలట్ ఆత్మహత్య వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు ఎయిర్ ఇండియాలో నారో-బాడీ పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) వెల్లడించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా పైలట్లను నిందించడాన్ని ఖండించాయి.
వివరాలు
టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే సమీపంలోని హాస్టల్‌పై కూలిన ఎయిర్ ఇండియా విమానం
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ఒకరిని మినహాయిస్తే 241 మంది ప్రయాణికులు మరణించారు. హాస్టల్‌లో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 271 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా రూ.కోటి చొప్పున పరిహారం అందించినట్లు అధికారికంగా వెల్లడించింది.