
Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరియన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల పలుచోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో తమిళనాడు తీరానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
ద్రోణి రూపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసినట్లు వెల్లడించింది.
పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Details
భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఇటీవల వడగండ్లతో వేడికెక్కిన నగర వాసులకు గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
ప్రస్తుతం మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. మరో రెండు రోజులు నగరంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Details
12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరో 21 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని అంచనా వేసింది.
ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పునరుద్ఘాటించింది.