
Rain Alert: మూడు రోజులపాటు భారీ వర్షసూచన.. రాష్ట్రవ్యాప్తంగా 'ఎల్లో' అలెర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి 'ఎల్లో' అలెర్ట్ జారీ చేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలు కాలనీలు, బస్తీలు నీటమునిగినట్లు పేర్కొంది.
వివరాలు
ఉప్పల్‌లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం
ముఖ్యంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్‌లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లా వేంసూరులో 8 సెం.మీ. వర్షం కురిసిందని పేర్కొంది. అలాగే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 7.8 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా మధిరలో 6.5 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లాలోని నారాయణపూర్ మండలం జంగంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించింది.