Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, వారికి పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది, తెలంగాణలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లో వరద నీటిలో కొట్టుకుపోగా, తెలంగాణలో ఒకరు గల్లంతయ్యారని సమాచారం.
97 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే (SCR) 140 రైళ్లను రద్దు చేయగా, 97 రైళ్లను దారి మళ్లించింది. దాదాపు 6,000 మంది ప్రయాణికులు వివిధ స్టేషన్లలో చిక్కుకుపోయారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, రాష్ట్ర విపత్తు సహాయ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 17,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్‌లో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పాఠశాలలకు సెలవు
సెప్టెంబర్ 2న హైదరాబాద్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో మాట్లాడి, వరదల సమస్యలను ఎదుర్కొనేందుకు పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని వంతెనలు, రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సెప్టెంబరు 2 నుంచి 5 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.