తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన
కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని మొత్తం 32 జిల్లాల్లో గురువారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వరంగల్‌లో ఆదివారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖానాపూర్‌లో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేటలో 48.8, హనుమకొండలో 41.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం
ఉరుములతో కూడిన వర్షం ఆదివారం పడిన కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భద్రాచలంలో 3.2 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో 2.3 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. దేశంలోని దక్షిణాది ప్రాంతాల్లో భారీగా వాతావరణ పరిస్థితులు మారుతాయని, ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఐఎండీ అంచనా ప్రకారం, ఆదివారం నుంచి ప్రారంభమైన వర్షాలు మరో 15రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రారంభమైన వర్షాలు మే 7వ తేదీ నాటికి దేశంలోని మధ్య, ఉత్తర భారత రాష్ట్రాలకు విస్తరిస్తాయని స్కైమెట్ వ్యవస్థాపక డైరెక్టర్ జతిన్ సింగ్ అన్నారు.