
Heavy rains: తెలంగాణను ముంచెత్తుతున్న వానలు.. హైదరాబాద్‌తో పాటు ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలు కుండపోతగా కురుస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం తీవ్ర వర్షాలతో నగరంలో జనజీవనం అతలాకుతలమైపోయింది. తాజాగా మంగళవారం అర్థరాత్రి నుంచి వర్షం కొనసాగుతోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం బుధవారం, గురువారం రోజుల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షబీభత్సం ముంచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
Details
రైతులు జాగ్రత్తగా ఉండాలి
ముఖ్యంగా అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి బయటకు రావద్దని సూచించారు. పిడుగులు పడే అవకాశాన్ని కూడా విస్మరించకూడదని హెచ్చరిస్తూ చెట్ల కింద నిలవరాదని, రైతులు సాయంత్రం సమయాల్లో పొలాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని అధికారులు స్పష్టంగా తెలిపారు.