
TG Weather Update: తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల నుంచి విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం ఉండగా, ఇది సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
ఇదే విధంగా కోస్తాంధ్ర, యానాం, మధ్య ప్రాంతాలు, వాటి పరిసర ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
Details
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం కూడా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఆయా జిల్లాలకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.