Page Loader
Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి 
ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి

Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య భారతాన్ని వరుణుడు విలయతాండవం ఆడిస్తున్నాడు. రెండు రోజులుగా కుండపోత వర్షాలు అక్కడి ప్రజలకు అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతోపాటు కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అసోంలో 12 జిల్లాలు వరదల ప్రభావానికి లోనయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. గౌహతిలో 67 ఏళ్ల రికార్డును అధిగమిస్తూ 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని వల్ల బ్రహ్మపుత్ర నది సహా అనేక నదుల్లో నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగింది.

Details

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లో తూర్పు కామెంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో కారుతో సహా వారు కొట్టుకుపోయారు. మరోవైపు, అసోంలో వరదలు, కొండచరియల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) ప్రకారం, వీరిలో ఐదుగురు కామరూప్ మెట్రోపాలిటన్‌ జిల్లాలో మృతి చెందారు. గౌహతిలోని బోండా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళలు మృతిచెందారని పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి జయంత్ మల్లా బారువా తెలిపారు. వాతావరణ శాఖ అసోంలోని పలు ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Details

ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ

కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు కూడా వెలువరించింది. వర్షాల ప్రభావంతో మేఘాలయలోని తురా, అసోంలోని గౌహతి మధ్య నడిచే జాతీయ రహదారి 17 (NH-17) పూర్తిగా దెబ్బతింది. ముఖ్యమైన విభాగాలు బోకో, చైగావ్‌లలో కొట్టుకుపోవడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మణిపూర్‌, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న విపత్కర వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం నెలకొంది.