Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బుధవారం ఉదయమే భారత్‌కు చేరుకున్నారు. రైసినా డైలాగ్ అనేది భారతదేశం నిర్వహించే సదస్సు. భారత ప్రభుత్వం ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంది. విదేశాంగ విధానం, ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే ఈ సదస్సు లక్ష్యం.
'రైసినా' అంటే అర్థం ఇదే..
ఈ సదస్సులో రాజకీయ (ఒక దేశంలోని అగ్రనేతలు, క్యాబినెట్ మంత్రులు మొదలైనవారు), వ్యాపారవేత్తలు, పరిశోధకులు, మేధావులు, మీడియా, పౌర సమాజంతో సహా అనేక నేపథ్యాల ప్రజలు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సును దిల్లీ స్వతంత్ర థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. 'రైసినా డైలాగ్' పేరులోని 'రైసినా' అనే పదం దిల్లీ నడిబొడ్డున ఉన్న రైసినా కొండను సూచిస్తుంది. ఈ కొండపైనే రాష్ట్రపతి భవన్‌ను నిర్మించారు.
సమావేశానికి ఎవరు హాజరవుతారు?
115 దేశాల నుంచి 2,500 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారు. ఇందులో పలువురు మంత్రులు, మాజీ ప్రధానులు మరియు అధ్యక్షులు, సైనిక కమాండర్లు, సాంకేతిక నాయకులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, వ్యూహాత్మక వ్యవహారాల పండితులు, ప్రముఖ థింక్ ట్యాంక్‌ల నిపుణులు ఉంటారు. రైసినా డైలాగ్ కాన్ఫరెన్స్ భారతదేశంలో 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. దీన్ని షాంగ్రి-లా డైలాగ్ తరహాలో భారత్ నిర్వహిస్తుంది. సింగపూర్‌లో జరిగే భద్రత, రక్షణ గురించి చర్చించడానికి షాంగ్రీ-లా డైలాగ్‌ను నిర్వహిస్తారు.