
RajnathSingh: బాధ్యతలేని పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమేనా..?: రాజ్‌నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ఒక దుష్టదేశం వద్ద అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా? అనే ప్రశ్నను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాల ముందుంచారు.
పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్వాధీనం చేసుకొని పర్యవేక్షించాలని సూచించారు.
రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అక్కడకు చేరుకున్న ఆయనకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి, ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఉన్నా వాటిని నిర్మూలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
ఉగ్రవాదంపై మునుపెన్నడూ లేనంత ఘాటైన హెచ్చరిక
ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు ఆయన శిరస్సు వంచి ఘన నివాళులు అర్పించారు.
"ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని.. అదొక కమిట్‌మెంట్ " అని ఆయన తెలిపారు.
భారత్‌పై ఉగ్రదాడి జరగితే దానిని ఓ యుద్ధ చర్యగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత సైన్యం ధైర్యంగా, చాకచక్యంగా విధులు నిర్వహిస్తోందని ప్రశంసించారు.
అలాంటి కఠిన పరిస్థితుల్లో సైనికుల మధ్య ఉండటం తనకు గర్వకారణమని చెప్పారు. అలాగే, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆయన నివాళులు అర్పించారు.
వివరాలు
షెల్లింగ్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన
ఈ పర్యటనలో భాగంగా, పాకిస్థాన్ షెల్లింగ్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను రక్షణ మంత్రి పరిశీలించారు.
అలాగే, భారత భద్రతా బలగాల సిద్ధతను సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా చినార్ కోర్ (15వ కోర్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు.
అక్కడ ఆర్మీతో పాటు వాయుసేన అధికారులతో కూడా సమావేశం కానున్నారు.
ఈ సందర్బంగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
వివరాలు
చినార్ కోర్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్
ఇదే సమయంలో, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా జమ్మూకశ్మీర్‌లో పర్యటన కొనసాగిస్తున్నారు.
ఆయన నేడు చినార్ కోర్‌లోని డాగర్స్ డివిజన్‌లో ఉన్న వివిధ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించినందుకు వారికి అభినందనలు తెలిపారు.