Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం లోక్‌సభలో జీరో అవర్ ముగిసిన తరువాత రాజ్యాంగంపై చర్చ ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యాంగంపై చర్చను లోక్‌సభలో ప్రారంభించారు.
కీలక పథకాల అభివృద్ధి
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, రాజ్యాంగం దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక మార్గదర్శకంగా, ప్రతి వ్యక్తికి శక్తివంతమైన గుర్తింపును అందించేది అని ఆయన పేర్కొన్నారు. కానీ, అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని అవమానించినట్లుగా ఆయన ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఈ చర్చ శనివారం వరకు కొనసాగనుంది. సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. చర్చకు ముగింపు పలుకుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు సమాధానం ఇవ్వనున్నారు.