LOADING...
Ayodhya Ram: రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్
PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్

Ayodhya Ram: రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతోందనే కారణంతో ఆలయానికి సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిరాకరించింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి జిల్లా పరిపాలనకు చేరిన ఫిర్యాదుపై సమాచారం కోరినా ట్రస్ట్ స్పందించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయోధ్యకు చెందిన బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్.. రామాలయ ట్రస్ట్‌కు అందుతున్న విరాళాలు,బ్యాంకు ఖాతాల నిర్వహణతో పాటు భూముల కొనుగోలు,విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

వివరాలు 

జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలు,సమకూరిన ఆస్తుల వివరాలను బహిరంగపరచాలని కోరుతూ ఆయన జూన్ 9న మొదటి ఫిర్యాదు, జూన్ 12న రెండో ఫిర్యాదును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ ఫిర్యాదులు అందిన మరుసటి రోజే, అంటే జూన్ 13న ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. బీజేపీ నేత ఫిర్యాదును ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలించి, తదుపరి చర్యల కోసం అయోధ్య జిల్లా పరిపాలన అధికారులకు పంపింది. PMO నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం రామాలయ ట్రస్ట్‌ను సంప్రదించి ఆదాయ-వ్యయాల వివరాలు సమర్పించాలని కోరింది.

వివరాలు 

చంపత్ రాయ్‌ను వివరాలు కోరిన ప్రధానమంత్రి కార్యాలయం

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,జూన్ 23న అయోధ్య అదనపు జిల్లా మేజిస్ట్రేట్(పరిపాలన) విశు రాజాకు రాసిన లేఖలో,అదనపు జిల్లా మేజిస్ట్రేట్(శాంతిభద్రతలు)ఇంద్రకాంత్ ద్వివేది ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ లేఖలో,ప్రధానమంత్రి కార్యాలయం పంపిన ఫిర్యాదు ఆధారంగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ను సంప్రదించి విరాళాలు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని,దర్యాప్తు బృందం అవసరమైన అన్ని కీలక రికార్డులను సేకరిస్తోందని చెబుతూ చంపత్ రాయ్ వివరాలను అందించడానికి నిరాకరించినట్లు వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆర్థిక సమాచారం వెల్లడించలేమని ట్రస్ట్ స్పష్టం చేసినట్లు జిల్లా అధికారుల లేఖలో పేర్కొన్నారు. దీంతో అయోధ్యరామాలయ నిధుల వివాదం మరోసారి రాజకీయ,పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement