Polavaram project: పోలవరం డయాఫ్రం వాల్ వేగంగా నిర్మించారు.. విదేశీ నిపుణుల బృందం కితాబు
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, తమ ఐదో పర్యటనతో పోలిస్తే ఆరో పర్యటన నాటికి గణనీయమైన పురోగతి స్పష్టంగా కనిపిస్తోందని విదేశీ నిపుణులు హించ్‌బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి సిస్కోలు ప్రశంసించారు. గత మూడు నెలల వ్యవధిలో ప్రాజెక్టులో మంచి స్థాయిలో అభివృద్ధి చోటుచేసుకుందని వారు పేర్కొన్నారు. గతంలో 2026 జూన్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేయడం సాధ్యం కాదని బావర్ కంపెనీ ప్రతినిధులు తెలిపినా, ప్రస్తుతం ఫిబ్రవరి నెలకే ఆ పనులు ముగింపు దశకు చేరుకుంటున్నాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షల అనంతరం గురువారం రాజమహేంద్రవరంలోని ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో అధికారులు, ఇంజినీర్లతో వారు సమావేశమయ్యారు.
వివరాలు
ఇసుక రీచ్‌లో 23అడుగుల లోతు వరకు ఆకృతులకు అనుమతులు
ఈ సందర్భంగా మూడు రోజుల చర్చల అంశాలను మరోసారి సమీక్షించి,తమ అభిప్రాయాలను మౌఖికంగా వెల్లడించారు. ప్రధాన డ్యాం నిర్మాణంలో ఉపయోగిస్తున్న ఇసుక,రాయి,క్లే వంటి పదార్థాల నాణ్యత సంతృప్తికరంగా ఉందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1 ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన ఆకృతులకు ఇప్పటికే ఆమోదం లభించిందని అధికారులు వివరించారు. గ్యాప్-2 ప్రధాన డ్యాంకు సంబంధించి ఇసుక రీచ్‌లో 23అడుగుల లోతు వరకు ఆకృతులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తవ్వడానికి జూన్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. గ్యాప్-2 ప్రధాన డ్యాం బంకమన్నరీచ్‌కు సంబంధించిన ఆకృతులపై గత మూడు రోజులుగా విస్తృతంగా చర్చలు జరిగాయని,ఈ విషయంలో సూత్రప్రాయంగా విదేశీ నిపుణులు మౌఖిక ఆమోదం ఇచ్చారని వెల్లడించారు.
వివరాలు
2027 జూన్‌కు సాధ్యమే
ఇదిలా ఉండగా, పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ఐదో పర్యటనలో చర్చలు జరిగాయని విదేశీ నిపుణులు గుర్తుచేశారు. తాజాగా ఆ లక్ష్యాన్ని 2027 జూన్‌కు ముందుకు తెచ్చినట్లు తెలిపారు. ఆ గడువు లోపల ప్రాజెక్టును పూర్తిచేసే సామర్థ్యం అధికారులకు ఉందని, ఆ దిశగా పనులు సాగుతున్న తీరు చూస్తే ఆ నమ్మకం మరింత బలపడుతోందని వారు అభిప్రాయపడ్డారు.