RAPIDX Train : 'ర్యాపిడ్'ఎక్స్ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు
భారతదేశంలో మరో హైస్పీడ్ ప్రాంతీయ రైలు పట్టాలెక్కనుంది.ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కేంద్రం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం రాజధాని ప్రాంతంలో భారత తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గంటకు 160 కి.మీల వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో అధునాతన వసతులను పొందుపర్చారు. దేశంలోనే తొలిసారిగా దిల్లీ- ఘజియాబాద్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య ఈ రైలు దూసుకెళ్లనుంది. సాహిబాబాద్,దుహై మధ్య 17కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో ర్యాపిడ్‌ఎక్స్ రైలుకు మోదీ పచ్చజెండా ఊపనున్నారు. సాహిబాబాద్ నుంచి దుహై మధ్య 5 స్టేషన్ల (సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దర్, దుహై, దుహై డిపో) మీదుగా సర్వీసులందిస్తుంది.
అక్టోబర్ 21 నుంచి అందుబాటులోకి రానున్న రైలు
'RAPID'X రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు. అక్టోబర్ 21 నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి రైలులో 2×2 లే అవుట్‌లో సీట్లు, నిల్చునేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలతో పాటు అత్యవసరమైన డోర్ ఓపెనింగ్ మెకానిజం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, డైనమిక్ రూట్ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తదితర సౌకర్యాలు ఈ రైలు ఇమిడించుకోనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందించే RAPIDX రైళ్లు, ప్రతి 15 నిమిషాలకు చొప్పున సర్వీసులు అందించనుంది. ప్రతి రైలులోనూ ఆరు కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా రూపొందించారు.
మహిళలకు ప్రత్యేకమైన కోచ్
అయితే స్టాండర్డ్ కోచ్‌ల్లో కనీస టిక్కెట్ ధర రూ.20, గరిష్ఠ ధరను రూ.50గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్‌ల్లో రూ.40, కాగా, గరిష్ఠ ధర రూ.100గా ఫిక్స్ చేశారు. ప్రతి రైలులో మహిళల కోసం ప్రత్యేక కోచ్ ఉంటుంది. ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లతో పాటు కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్ రెస్ట్‌లు లాంటి స్పెషల్ ఫీచర్లున్నాయి. ప్రీమియం కోచ్‌లోకి ప్రవేశించేందుకు ప్లాట్‌ఫాంలోని ప్రీమియం లాంజ్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. సౌకర్యవంతమైన కుషన్ సీట్లను ఏర్పాటు చేశారు. ప్రతి రైలులోని ప్రీమియం కోచ్‌లో ప్రయాణికుల సహాయార్థం సిబ్బందిని కేటాయించారు.