LOADING...
#NewsBytesExplainer: SLBC సొరంగం వద్దకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌! వీళ్లు ఏం చేస్తారు? 
SLBC సొరంగం వద్దకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌! వీళ్లు ఏం చేస్తారు?

#NewsBytesExplainer: SLBC సొరంగం వద్దకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌! వీళ్లు ఏం చేస్తారు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ బ్రాంచ్ కాలువ (SLBC)లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాల్లో విజయవంతంగా ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈసారి కూడా వినియోగిస్తున్నారు. చిక్కుకున్న వారు లోపల ఇబ్బంది పడకుండా చూడటం కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఇసుక, బురద కారణంగా సహాయ చర్యలు అమలు చేయడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు. చిక్కుకున్న వారి ఖచ్చితమైన స్థానం గుర్తించేందుకు ప్రత్యేకంగా ఆక్వా ఐ పరికరాన్ని పంపిస్తున్నారు. అదనంగా, ఇటీవల ఉత్తరాఖండ్‌లో విజయవంతంగా అమలు చేసిన ర్యాట్ హోల్ మైనింగ్ విధానాన్ని ఉపయోగించేందుకు కూడా ప్రణాళికలు వేస్తున్నారు.

వివరాలు 

ఉత్తరాఖండ్ ఘటన.. ర్యాట్ హోల్ మైనింగ్ 

2023 నవంబర్ 12న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా బెండ్-బార్కోట్ సొరంగంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతిని విజయవంతంగా ఉపయోగించారు. ఇప్పుడు SLBC వద్ద కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులు పరిశీలిస్తున్నారు.

వివరాలు 

SLBCలో ప్రమాదం 

శ్రీశైలం ఆనకట్ట వెనుక విస్తరించి ఉన్న 44 కి.మీ పొడవైన SLBC సొరంగంలో శనివారం ఉదయం ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. లీకేజీ మరమ్మతు చేసే క్రమంలో ఓ భాగం కూలిపోవడంతో కొందరు తప్పించుకోగలిగినా, ఎనిమిది మంది లోపలే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం, నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు మూడో రోజు నుంచీ నిరంతరంగా కృషి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని అక్కడే ఉంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన ప్రకారం,చిక్కుకున్న వారిని రక్షించేందుకు కనీసం మూడు నుండి నాలుగు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద స్థలమంతా బురద, నీటితో నిండిపోవడం సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని చెప్పారు.

వివరాలు 

ర్యాట్ హోల్ మైనింగ్ మెథడ్ అంటే ఏమిటి? 

అయితే, వారిని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఎలుక బొరియల మాదిరిగా మైనింగ్ చేసేది. ఇది నాలుగు అడుగుల వెడల్పును మించకుండా లోతైన గుంతలను తవ్వే విధానం. ఈ విధానం బొగ్గు గనులు లేదా ఇతర మైనింగ్ కార్యకలాపాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ కేవలం ఒక మనిషి వెళ్లగలిగేంత చిన్న మార్గాన్ని మాత్రమే తయారు చేస్తారు.గుంత తవ్విన తర్వాత తాళ్లు లేదా నిచ్చెనల సహాయంతో లోపలికి ప్రవేశిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా చిన్న రంధ్రాలను తవ్వుతారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని సందులను తొలగించి లోపలికి వెళ్లేందుకు మార్గాన్ని సృష్టిస్తారు. ఉత్తరాఖండ్‌లో కూడా ఇదే విధానాన్ని ఉపయోగించి 15 మీటర్ల దూరం వరకు మాన్యువల్‌గా తవ్వారు.

వివరాలు 

ర్యాట్ హోల్ మైనింగ్ నిషేధానికి కారణం 

ఈ ప్రక్రియ ద్వారా చిక్కుకున్న వారికి ఆక్సిజన్, తాగునీరు, ఆహారం సరఫరా చేశారు. చివరకు పెద్ద మార్గాన్ని ఏర్పరచి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ పద్ధతి విజయవంతమైనప్పటికీ, దాని ముప్పుల కారణంగా పలు ప్రాంతాల్లో నిషేధించబడింది. మేఘాలయలో బొగ్గు గనుల్లో దీన్ని విస్తృతంగా ఉపయోగించేవారు.అయితే,ఈ విధానం అధిక ప్రమాద స్థాయిని కలిగి ఉండటంతో పాటు,పర్యావరణానికి హానికరం అనే కారణంగా 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)దీనిని నిషేధించింది. ఖర్చు తక్కువగా ఉండటం వల్ల పలువురు దీన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతూనే ఉన్నారు. ఇప్పుడు SLBC వద్ద ఈ పద్ధతిని ఉపయోగించేందుకు బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే,ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు.