Page Loader
Ration Card: రేషన్ కార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ ప్రూఫ్స్‌తో మీసేవలో అప్లై చేయండి

Ration Card: రేషన్ కార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ ప్రూఫ్స్‌తో మీసేవలో అప్లై చేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇటీవల ఈ ప్రక్రియపై వివిధ ప్రకటనలు వెలువడటంతో ప్రజలు కాస్త గందరగోళానికి గురయ్యారు. ప్రారంభంలో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఒక ప్రకటన రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని క్యూ కట్టారు. అయితే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు దరఖాస్తులను వార్డు సభల్లోనే స్వీకరిస్తామని సీఆర్డీఓ ఫణీంద్రరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. మీ సేవ కేంద్రాల్లోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు.

Details

ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసి ఉంటే మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.

కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు పాత కార్డుల్లో తప్పుల సవరణలు, కొత్త సభ్యుల జోడింపునకు కూడా అవకాశం ఉందని తెలిపారు. కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసే వారు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆధార్ కార్డులు, ఇంటి కరెంట్ బిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారు కుటుంబ సభ్యుల పేర్లను జత చేయాలనుకుంటే, సంబంధిత వారి ఆధార్ కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ప్రజాపాలన, ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ కోసం ప్రభుత్వం రూ.50 ఫీజు నిర్ణయించింది. కొత్త కార్డుల దరఖాస్తులతో పాటు పాత కార్డుల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.