
'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తాను చెప్పిన 'రాయల తెలంగాణ' సిద్ధాంతాన్ని మరోసారి లేవనెత్తారు.
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి సోమవారం రాయలసీమలోని కర్నూలు, అనంతపురంలను తెలంగాణలో కలపాలని కోరారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం విశాల రాయల తెలంగాణగా మారుతందన్నారు.
త్వరలో రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు ఇప్పటికే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)తో చర్చలు జరిగాయని పేర్కొన్నారు.
రాయలసీమ నీటి కష్టాలు తీరాలంటే ఇదొక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
జేసీ
విలీనం చేయడం చాలా సులభం: జేసీ
రాష్ట్రాలను విభజించడం చాలా కష్టమైన పని అయితే వాటిని విలీనం చేయడం చాలా సులభమని దివాకర్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో రాయలసీమ విలీనానికి వ్యతిరేకంగా ఎవరికీ అభ్యంతరాలు ఉండవన్నారు. ఇదిలా ఉంటే, జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
పరిపాలనా అధికారాలను వికేంద్రీకరించే చొరవలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రణాళికను ముందుకు తెస్తున్న నేపథ్యంలో దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.