Page Loader
Pashamylaram: పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!
పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!

Pashamylaram: పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన మరింత విషాదం తెచ్చిపెట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇంకా పలువురు తీవ్రంగా గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు సంభవించగా, ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

Details

 మొత్తం 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం

ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు ధాటికి ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇప్పటివరకు మరో 30 మంది మృతి చెందారు. తీవ్రతకు భవనం పూర్తిగా కూలిపోగా, మరో భవనానికి బీటలు వచ్చాయి. పేలుడు సమయంలో కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపోయినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

Details

వైస్‌ ప్రెసిడెంట్‌ గోవన్‌ మృతి 

ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా ఈ పేలుడులో దుర్మరణం చెందారు. ఆయన ప్లాంట్‌లోకి అడుగుపెడుతున్న సమయంలోనే పేలుడు సంభవించడంతో, ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమాచారం తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించడంతో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. భవన శిథిలాలు, మంటలు, శవాలు అనే దృశ్యాలు అక్కడి పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి.

Details

సహాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ 

ప్రమాద బాధితుల వివరాల కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.సమాచారానికి 08455-276155నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఈ ఘటనపై మంత్రి వివేక్‌ స్పందిస్తూ పరిశ్రమల భద్రతపై త్వరలోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక పని గంటలపై ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ విచారణ చేపడుతుందని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహా ఈ ప్రమాదాన్ని దురదృష్టకరమని పేర్కొంటూ, అన్ని అధికార విభాగాలు వేగంగా స్పందించాయని తెలిపారు. ఈ ప్లాంట్‌లో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే రసాయన పదార్థాన్ని తయారు చేస్తున్నారని, 40 ఏళ్లుగా ఈ సంస్థ కొనసాగుతోందని తెలిపారు. ప్రమాదానికి గల అసలైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై లోతుగా దర్యాప్తు జరగనున్నట్లు వెల్లడించారు.