Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌గా పదోన్నతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది. గత మూడేళ్లలో ఏర్పడిన ఖాళీలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పదోన్నతుల జాబితాను విడుదల చేసింది. 2022 సంవత్సరానికి 11 మంది, 2023 సంవత్సరానికి ముగ్గురు, 2024 సంవత్సరానికి ఇద్దరికి ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తూ బుధవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన అధికారుల సేవా ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఒకరు నేరుగా డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించగా, 14 మంది 1995 గ్రూప్-2 'ఏ' సర్వీస్‌లో డిప్యూటీ తహసీల్దార్లుగా, మరో ఒకరు గ్రూప్-2 'బీ' సర్వీస్‌లో తమ కెరీర్‌ను ప్రారంభించారు.
వివరాలు
ఈ సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా వీరికి ఐఏఎస్ హోదా
అంచెలంచెలుగా ఎదుగుతూ 2011లో వీరంతా ఒకేసారి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. తాజాగా 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా వీరికి ఐఏఎస్ హోదా దక్కింది. రాష్ట్రం నుంచి ఒకే సమయంలో 16 మంది ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2019 నుంచి 2021 వరకు రెవెన్యూ కోటా పదోన్నతులకు సంబంధించిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో, ఆ మూడు సంవత్సరాల ఖాళీలను 2022 ఖాళీలతో కలిపి మొత్తం 11 మందికి పదోన్నతులు మంజూరయ్యాయి. అదేవిధంగా 2023లో ఏర్పడిన మూడు ఖాళీలు, 2024లో ఏర్పడిన రెండు ఖాళీలను కూడా తాజాగా భర్తీ చేశారు.
వివరాలు
పదోన్నతులు ఇలా...:
2022 సంవత్సరానికి: డి. మధుసూదన్ నాయక్, ఎం. సత్యవాణి, జె. భవానీశంకర్, జి. లింగ్యా నాయక్, ఎ. నరసింహా రెడ్డి, జి. వీరారెడ్డి, జి.వి. శ్యాంప్రసాద్ లాల్, యు. రఘురాం శర్మ, పి. చంద్రయ్య, జి. ముకుంద రెడ్డి, ఎ. భాస్కర్ రావు. 2023 సంవత్సరానికి: వై.వి. గణేష్, అబ్దుల్ హమీద్, బి. వెంకటేశ్వర్లు. 2024 సంవత్సరానికి: ఎన్. ఖేమ్యా నాయక్, కె. గంగాధర్.
వివరాలు
చరిత్రలో నిలిచిపోతుంది: వి.లచ్చిరెడ్డి
ఈ పరిణామం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌గా పదోన్నతి కల్పించడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జేఏసీ నాయకులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.