భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు
2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ఏడాదిలో 25 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. అంటే గతేడాది కంటే రూ.49,000 కోట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందినట్లు భారతీయ రైల్వే చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ఆదాయం రూ. 1.62 లక్షల కోట్లకు పెరిగింది, ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 15 శాతం వృద్ధి. రైల్వే ప్రయాణీకుల ఆదాయం 61 శాతం వృద్ధితో రూ.63,300 కోట్లకు చేరుకుంది. మూడేళ్ల తర్వాత జాతీయ క్యారియర్ పెన్షన్ ఖర్చులను పూర్తిగా భరించగలదని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయంలో 61శాతం వృద్ధి
ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం పరంగా 2021-22లో రూ. 39,214 కోట్లు ఉంటగా, 2022-23లో ప్రయాణీకుల ఆదాయం రూ. 63,300కోట్లు ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 61శాతం ఎక్కువ. రైల్వే తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిందని, 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కొత్త లైన్‌లను ప్రారంభించడం, 5243 కి.మీల డబ్లింగ్/మల్టీ-ట్రాకింగ్ పనులను మొదలు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతీయ రైల్వే ముందుకుసాగుతోంది. భారతీయ రైల్వే 170 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది.