Page Loader
పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు
పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు

పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు

వ్రాసిన వారు Stalin
Aug 12, 2023
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ప్రాంతీయ పంచాయితీ రాజ్ కౌన్సిల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బెంగాల్‌లో జరిగిన హింసాకాండను టీఎంసీ రక్తంతో ఆడుకోవడంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మమతా బెనర్జీ పార్టీ ఓటర్లను బెదిరించి వారి జీవితాలను నరకప్రాయంగా మార్చిందని ప్రధాని ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి నామినేషన్ వేయకుండా చేయడానికి వారు ఏమైనా చేయడానికి వెనుకాడలేదన్నారు. చివరికి ఓటర్లను కూడా బెదిరించినట్లు చెప్పారు.

బీజేపీ

గూండాలను పురమాయించిన టీఎంసీ

ఓట్ల లెక్కింపు రోజున బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు టీఎంసీ గూండాలను పురమాయించిదని ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రాణాంతక దాడులనే టీఎంసీ ఆయుధంగా చేసుకుందని మోదీ అన్నారు. జులై 8న జరిగిన ఎన్నికల్లో, హింసాకాండకు గురైన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ రాష్ట్రంలో పునరావృతం అయ్యాయి. దాదాపు 80 శాతం (మొత్తం 3,317లో 2,641) గ్రామ పంచాయతీలు, 92 శాతం (మొత్తం 341లో 313) పంచాయతీ సమితులు గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలోని 20 జిల్లా పరిషత్‌లను టీఎంసీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సమయంలో మొత్తం 40మంది మరణించారు. ఒక్క పోలింగ్ రోజునే 21 మంది చనిపోయారు.