Page Loader
New Ration cards: రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట
రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట

New Ration cards: రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రేషన్‌ కార్డుల అప్‌డేట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పలు రేషన్‌ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేర్చుతున్నారు. పుట్టింటి కార్డుల నుంచి తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి రేషన్‌ కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌరసరఫరాల శాఖ మొదలుపెట్టింది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు అందగా, 6.70 లక్షల కుటుంబాలను అర్హులుగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు అందగా, వారిలో 11.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి మొదటి వారంలో 1.03 లక్షల మందిని కొత్త లబ్ధిదారులుగా గుర్తించి, 1,02,688 రేషన్‌ కార్డుల్లో వీరి పేర్లు చేర్చారు.

Details

 ఇన్నాళ్లూ అందని రేషన్‌, ఆరోగ్యశ్రీ 

కొన్ని కుటుంబాల్లో రేషన్‌ కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు మాత్రమే ఉండగా, పిల్లల పేర్లు లేకపోవడం వల్ల వారికి రేషన్‌ సరఫరా అందలేదు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరినా, రేషన్‌ కార్డులో పేరు లేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో లేకపోయాయి. అర్హత ఉన్నా కార్డుల్లో పేర్లు లేనివారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చివరిసారిగా 2016లో చేర్చారు. ఆ తర్వాత మీ-సేవా ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఏళ్ల తరబడి వాటిని పరిశీలించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని నిర్ణయం తీసుకోవడంతో అర్హులకు ప్రయోజనం కలుగుతోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురి పేర్లు చేర్చాలని దరఖాస్తులొచ్చాయి.

Details

రెండు దశల్లో దరఖాస్తుల పరిశీలన

అయితే ప్రస్తుతం చేర్చిన లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే, సగటున ఒక్కొక్కరినే చేర్చినట్లు తెలుస్తోంది. కొత్తగా 1.03 లక్షల మందికి రేషన్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.31.36 కోట్ల భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. వారికి ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుల పరిశీలన రెండు దశల్లో జరుగుతోందని పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదట, దరఖాస్తులోని ఆధార్‌ సంఖ్య సరైనదేనా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం ఆయా పేర్లు మరో రేషన్‌ కార్డులో నమోదై ఉన్నాయా? అనే విషయాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలిస్తున్నారు.