Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.
26ఏళ్ల విరామం తర్వాత హస్తినాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, కీలకమైన ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడా మహిళా సీఎం లేకపోవడంతో, ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని పార్టీ అమలు చేసింది.
శాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల భారీ మెజారిటీతో రేఖా గుప్తా గెలుపొందారు.
48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమక్షంలో, పార్టీ కేంద్ర పరిశీలకులు రవి శంకర్ ప్రసాద్, ఓపీ ధన్‌ఖడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రేఖా గుప్తా(ఓబీసీ నేత)ను శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Details
నాలుగో మహిళ ముఖ్యమంత్రిగా రికార్డు
ఆమె పేరును సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత దిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నాలుగో మహిళగా ఆమె నిలుస్తారు.
ముఖ్యమంత్రి పదవికి ముందుండి ప్రధాన పోటీదారుడిగా ఉన్న పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మకు నిరాశ ఎదురైంది.
మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన, ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించినప్పటికీ సీఎం రేసులో వెనుకబడ్డారు.
Details
25వేల మంది భద్రతా సిబ్బంది
రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతలతో కలిసి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశమై, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెను అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.
దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో వేలాది మంది ప్రజల సమక్షంలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సుమారు 25 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.