Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం, తొలి దశలో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
మంగళవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను సచివాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని మంత్రి కోరారు. మొదటి దశలో ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని బంజరు భూముల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Details
కనిగిరిలో మొదటి ప్లాంట్
ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమిని అందించేందుకు రెవెన్యూశాఖ మంత్రిని కోరినట్లు వెల్లడించారు.
రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.
తొలి ప్లాంట్‌ను ప్రకాశం జిల్లా కనిగిరిలో నెలకొల్పనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం కనిగిరిలో 4,000 ఎకరాల బంజరు భూమిని గుర్తించారు. ప్రభుత్వ భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.15,000, ప్రైవేట్ భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.30,000 చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
రైతులతో చర్చించి వీలైనంత త్వరగా భూసేకరణను పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
మొత్తం 500 ప్లాంట్ల ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత, దాదాపు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.