Page Loader
Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం
భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం

Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2024
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర రూ.80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్‌ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Details

మూడేళ్ల కనిష్ఠానికి చేరుకున్న క్రూడాయిల్ ధర

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర మూడేళ్ల కనిష్ఠానికి చేరింది. 2021 డిసెంబర్‌ తర్వాత బ్యారెల్‌ చమురు ధర మంగళవారం 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్‌ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌+ దేశాలు భావిస్తుండగా.. ఉత్పత్తిని పెంచాలని భారత్‌ కోరుతోంది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్‌ ఆయిల్‌ను వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

Details

ధరలు తగ్గించే అవకాశం

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది మార్చిలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను లీటరుకు రూ.2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. జమ్ము-కశ్మీర్, హరియాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మరోసారి పెట్రో ధరల కోతకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 90 శాతం పెట్రోల్ పంపులు ప్రభుత్వ అధీనంలోనే ఉండడంతో ప్రైవేటు రంగ కంపెనీలూ ఆ మేర వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది.