
AI Video row: మోదీ తల్లి AI వీడియోను తొలగించండి: కాంగ్రెస్‌కు పట్నా హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి దివంగత హీరాబెన్ మోదీ పై కాంగ్రెస్ ఏఐ వీడియో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వీడియో తీవ్ర దుమారానికి దారి తీసింది. ముఖ్యంగా, బిహార్ రాష్ట్రంలో హస్తం పార్టీపై కేసు కూడా నమోదైంది. కేసును పట్నా హైకోర్టు తాజాగా విచారించింది. దానిలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై షేర్ చేసిన ఆ వీడియోలను తక్షణమే తొలగించాలని హైకోర్టు హస్తం పార్టీని ఆదేశించింది. వివాదాస్పద వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన తల్లి హీరాబెన్ మోదీ కలలో వచ్చి సంభాషించినట్టు చూపించారు. 'సాహబ్ కలలోకి అమ్మ వచ్చింది' అనే శీర్షికతో బీహార్ కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోను 36 సెకన్ల వ్యవధిలో విడుదల చేసింది.
వివరాలు
కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు
ఈ వీడియో, ప్రజాస్వామ్య భావాలకు విరుద్ధంగా,ప్రధాన నాయకుల గౌరవాన్ని నష్టపరిచే విధంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మనోభావాలను గాయపరచే ఉద్దేశంతో రూపొందించినట్లు తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేసింది.