Loading...
Artist Srinivasan: తిరుమల శ్రీవారి రూపాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు మృతి!
తిరుమల శ్రీవారి రూపాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు మృతి!

Artist Srinivasan: తిరుమల శ్రీవారి రూపాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన ఆయన.. వయోభారంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. శ్రీనివాసన్ గీసిన శ్రీవేంకటాచలపతి చిత్రం దశాబ్దాలుగా భక్తుల ఇళ్లలో, దుకాణాల్లో, క్యాలెండర్లలో కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

వివరాలు

టీటీడీ ప్రకటనతో మొదలైన ప్రయాణం

1970లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు శ్రీవేంకటేశ్వర స్వామి మూలవిరాట్టు చిత్రాన్ని గీయించేందుకు ఆసక్తి ఉన్న చిత్రకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం ఓ వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారు.

ప్రముఖ చిత్రకారుడు ఓవిమామణి కొండైరాజు వద్ద చిత్రకళను అభ్యసించిన శ్రీనివాసన్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన టీటీడీ అధికారులు తిరుమలకు రావాలని ఆహ్వానిస్తూ లేఖ పంపించారు.

అయితే అదే సమయంలో శ్రీనివాసన్‌కు అనూహ్యంగా తట్టు వ్యాధి సోకింది. దీంతో టీటీడీ నిర్ణయించిన తేదీకి తిరుపతికి వెళ్లలేకపోయారు.

ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత దేవస్థానం పంపిన లేఖతో తిరుమలకు చేరుకున్న ఆయన.. తనకు ఎదురైన అనారోగ్య సమస్యలను అధికారులకు వివరించారు.

వివరాలు

స్వామివారి రూపాన్ని నిశితంగా పరిశీలించి చిత్రీకరణ

గర్భగుడి సమీపంలో కూర్చొని స్వామివారి చిత్రాన్ని గీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం కొంతకాలం ప్రయత్నించిన అనంతరం టీటీడీ నుంచి అనుమతి లభించింది.

శ్రీనివాసన్‌కు స్వామివారి మూలవిరాట్టుతో పాటు ఆభరణాలను చిత్రించే అవకాశం కల్పించారు. ఆభరణాలతో అలంకరించిన రూపంతోపాటు, ఆభరణాలు లేని స్వామివారి రూపాన్ని కూడా చిత్రించేందుకు అరరోజు సమయం కేటాయించినట్లు సమాచారం.

గర్భగుడి సమీపంలో కూర్చొని స్వామివారి రూపాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఆయన ఈ చిత్రాలను రూపొందించారు.

కొండైరాజు గురుకులంలో శిక్షణ పొందిన ప్రతి శిష్యుడికీ తనదైన ప్రత్యేక చిత్రకళా శైలి ఉండేది. ఆ సంప్రదాయానికి చెందిన శ్రీనివాసన్ కూడా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఆయన గీసిన తిరుమల శ్రీవేంకటాచలపతి చిత్రం విశేషంగా ప్రాచుర్యం పొందింది.

ADVERTISEMENT

వివరాలు

ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఇళ్లలో స్వామివారి చిత్రం

శ్రీనివాసన్ రూపొందించిన ఈ చిత్రాన్ని శివకాశికి చెందిన ప్రింటర్స్ ముద్రించి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత క్యాలెండర్ల రూపంలోనూ అందుబాటులోకి వచ్చింది. అలా ఆయన గీసిన స్వామివారి చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లలో, దుకాణాల్లో, భక్తుల పూజా మందిరాల్లో కనిపించే ప్రసిద్ధ చిత్రంగా మారింది.

శ్రీవేంకటేశ్వర స్వామి రూపాన్ని తన కుంచెతో అద్భుతంగా ఆవిష్కరించి లక్షలాది మంది భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రీనివాసన్ మరణంతో చిత్రకళా రంగంలో విషాదం నెలకొంది.

ఆయన గీసిన స్వామివారి చిత్రం మాత్రం భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ADVERTISEMENT