LOADING...
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC టన్నెల్)మరో మృతదేహం ఆనవాళ్లు కనుగొన్నారు. తవ్వకాలు నిర్వహిస్తున్న సమయంలో లోకో ట్రాక్ వద్ద మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడినట్లు తెలుస్తోంది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అనుమానిత ప్రాంతాలైన డీ1, డీ2 కాకుండా మరొక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.దీనికి సంబంధించి అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. లభించిన ఆనవాళ్లు నిజంగానే మృతదేహానివే అయితే సాయంత్రం వరకు దాన్ని బయటకు తీసే అవకాశం ఉందని సమాచారం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే.

వివరాలు 

ఇక ముందుకు వెళ్లలేం! 

ఈ ప్రమాదం జరిగిన ఒక నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఒకరి మృతదేహమే లభ్యమైంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్‌లో అన్వేషణ కొనసాగించడం ఇక సాధ్యం కాదని రెస్క్యూ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ పైకప్పు బలహీనంగా మారిపోయిందని, అది మరింత కూలిపోయే ప్రమాదం ఉన్నదని, ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తే రెస్క్యూ బృందం కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే, గల్లంతైన ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించే వరకు అన్వేషణ కొనసాగించాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించినట్టు సమాచారం.