Online Content: ఆన్‌లైన్ కంటెంట్‌పై బాధ్యత తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణ అవసరంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అవుతున్న కంటెంట్‌కు (Online Content) ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం స్పష్టమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya Kant) అభిప్రాయపడ్డారు. వ్యక్తులు స్వతంత్రంగా ఛానళ్లను ప్రారంభించి, ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా ఈ సూచనలు వెలువడ్డాయి. ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారం గురించి ప్రశ్నించిన రణ్‌వీర్ అలహాబాదియా ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Details
ఆన్‌లైన్ కంటెంట్‌పై ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే
దీనికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, "ఇది కేవలం అశ్లీలత అంశం మాత్రమే కాదు. సామాజిక మాధ్యమాల్లో యూజర్లు తయారుచేస్తున్న కంటెంట్‌లోని లోపాలు స్పష్టమవుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అమూల్యమైన హక్కు అయినప్పటికీ, దాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ, "ఇదే అసలు సమస్య. 'నేను సొంతంగా ఛానల్ క్రియేట్ చేశాను... అందువల్ల ఎవరికీ జవాబుదారీ కాను' అనే సందేశం వెలుతున్నది. ఇది పూర్తిగా తప్పు. ఆన్‌లైన్ కంటెంట్‌పై ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే'' అన్నారు.
Details
నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలి
దేశ వ్యతిరేక కంటెంట్ అప్‌లోడ్ అయ్యే సందర్భంలో కూడా క్రియేటర్ బాధ్యత ఎలా పరిగణించాలి అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. అసభ్యకర కంటెంట్ అప్‌లోడ్ అయితే, అధికారులు చర్యలు ప్రారంభించేలోపే అది వైరల్ అవుతోంది. లక్షలమంది చూస్తున్నారు. అలాంటప్పుడు నియంత్రణ ఎలా సాధ్యం?'' అని ప్రశ్నించారు. ఆన్‌లైన్ కంటెంట్‌ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వినియోగదారులు సృష్టించే సోషల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించే కొత్త నిబంధనలను రూపొందించేందుకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.