Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు
తెలంగాణలో భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి, దీనితో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల ప్రభావం వల్ల పర్యాటకులకు కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉన్నాయి, కాబట్టి పర్యాటకులు కొద్దీ రోజుల పాటు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలో బాగా వర్షాలు కురుస్తున్నాయి, ఇక్కడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు పర్యాటకులు బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు, సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని సందర్శించకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్థానికులు,ఇతర జిల్లాల సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
పాకాల సరస్సు వద్ద ఆంక్షలు
ప్రజల భద్రత కోసం ములుగు జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపల వేటకు తాత్కాలికంగా నిషేధం విధించారు. పెద్ద వర్షాల కారణంగా చెరువులు, వాగులు, కాలువల్లో ఈత కొట్టడాన్ని నిషేధించారు. వరంగల్ జిల్లా పాకాల సరస్సు వద్ద కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. పాకాల మత్తడి పోస్తున్న కారణంగా అక్కడకు అనుమతి ఇవ్వడం లేదు. నర్సంపేట నుంచి పాకాల వైపు వెళ్లే మార్గంలో అశోక్ నగర్ దాటిన తర్వాత వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది,కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్తగూడెం,గుంజేడు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉధృతంగా మాధన్నపేట వాగు..
నర్సంపేట మండలం మాధన్నపేట చెరువు మత్తడి పోస్తోంది, దాంతో మాధన్నపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మత్తడి వద్దకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున నర్సంపేట-మాధన్నపేట, నర్సంపేట చెన్నారావుపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.