Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన సినీ పరిశ్రమపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని, ఇందులో భాగంగానే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతికి సంబంధించి అందరూ విచారం వ్యక్తం చేశారని, బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలిచారని చెప్పారు. అలాగే గాయపడిన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారని గుర్తు చేశారు. ఘటన ముగిసిన తర్వాత, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం సభ్యుల ద్వారా ప్రశ్న అడిగించి వివాదం కల్పించారని బండి సంజయ్ విమర్శించారు. అసలు ప్రణాళిక ప్రకారం సినీ పరిశ్రమను దెబ్బతీయడానికి, అల్లు అర్జున్ వ్యక్తిత్వంపై నిందలు వేయడానికి కుట్ర జరిగినట్లు పేర్కొన్నారు.
సినీ ఇండస్ట్రీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం
ఇది స్పష్టంగా సినీ ఇండస్ట్రీని తక్కువ చేయడానికి, వారి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నమన్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇతర అంశాల్లోనూ దాడి చేశారు. గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం తిని మరణిస్తున్నారని, కానీ సీఎం వారి కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా అని పేర్కొన్నారు. ఆ మరణాలకు మీ ప్రభుత్వం బాధ్యత వహించిందా? మీకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీని నమ్మడం వల్ల కాంగ్రెస్ కూడా భారాస విధినే అనుభవించబోతోందని బండి సంజయ్ హెచ్చరించారు.
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
గతంలో ఎంఐఎం మాయాజాలానికి బీజేపీ నష్టపోయిందని, ఇప్పుడు అదే ముద్ర కాంగ్రెస్ పార్టీపై పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను విడిచిపెట్టాలని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సమగ్ర అభివృద్ధిని పక్కనపెట్టడం తగదని బండి సంజయ్ అన్నారు.