Page Loader
Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి
'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి

Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం "భూభారతి" అమలులో భాగంగా, మంగళవారం (నేడు) నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ప్రజల్లో భూభారతిపై అవగాహన పెంచే ఉద్దేశంతో, సోమవారం ఆయన సచివాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ''గత ప్రభుత్వాల లోపభూయిష్ట నిర్ణయాల కారణంగా రైతులు భూసంబంధిత సమస్యల్లో చిక్కుకున్నారని'' తెలిపారు. రైతుల అనుమతితో కాకుండా తీసుకున్న చర్యలు భూ పరిపాలన వ్యవస్థలో లోపాలకు దారితీశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ప్రభుత్వం ప్రజల దాకా భూ పరిపాలనను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.

వివరాలు 

 "ప్రజల వద్దకే రెవెన్యూ"  నినాదంతో సదస్సులు 

అందులో భాగంగా, ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. తొలుత ఒక్కో జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఆ ప్రాంతాల్లో కొత్త చట్టాన్ని అమలు చేశామని వివరించారు. ఇప్పుడు నేటి నుంచి జూన్ 20వ తేదీ వరకు రాష్ట్రంలోని మిగతా అన్ని మండలాల్లో "ప్రజల వద్దకే రెవెన్యూ" అనే నినాదంతో సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌తో కూడిన అధికార బృందాలు ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్లి ప్రజల నుండి భూసమస్యలపై దరఖాస్తులను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతాయని పేర్కొన్నారు.

వివరాలు 

 "సాదాబైనామా"లపై ఎక్కువ దరఖాస్తులు 

పైలట్ మండలాల్లో ఇప్పటికే 55,000 దరఖాస్తులు వచ్చాయని, ఇది భూ సమస్యల తీవ్రతను తెలియజేస్తోందని చెప్పారు. ఈ దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఇప్పటి వరకూ దాదాపు 60 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా "సాదాబైనామా"లపై ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్లు భూసమస్యలను మానవీయ దృష్టికోణంతో పరిశీలించి పరిష్కరించాలని మంత్రి పిలుపునిచ్చారు. వారు క్షేత్రస్థాయిలో తరచుగా పర్యటించి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ అధికారులకు త్వరలోనే నియామకపత్రాలు అందజేస్తామని చెప్పారు.

వివరాలు 

6,000 మంది సర్వేయర్ల నియామకం 

కొత్త చట్టంలోని ముఖ్యమైన అంశంగా, భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపును కూడా జతపరచే విధానాన్ని తీసుకువచ్చామని వివరించారు. ఈ చర్యలతో భూ కొలతలు, భూదస్త్రాల నిర్వహణ మరింత సమర్థవంతం కావడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం రాబోయే రెండు నెలల్లో మొదటి దశగా 6,000 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.