Telangana: బియ్యం ధరలు దిగొస్తున్నాయ్.. నెల రోజుల్లో కిలోపై రూ.10 తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన బియ్యం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కిలో బియ్యంపై సగటున రూ.10 వరకు ధర తగ్గడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు, పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమ నిల్వలపై జరిపిన వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. దీంతో బియ్యం వ్యాపారుల సిండికేట్‌కు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం బియ్యం దుకాణాల్లో గతంలో ఉన్నంత ధరల హడావుడి కనిపించడం లేదు. అమ్మకాలు కూడా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
వివరాలు
సన్న బియ్యం ధర కిలోకు ఏకంగా రూ.100
గత నెలలో ఎల్‌నినో ప్రభావం కారణంగా బియ్యం కొరత ఏర్పడుతుందంటూ కొందరు రైస్ మిల్లర్లు, వ్యాపారులు ప్రచారం చేశారు.
ఖరీఫ్ పంట దిగుబడి ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్‌కు చేరకముందే, రాబోయే ఎనిమిది నెలల పాటు బియ్యం కొరత తప్పదంటూ వదంతులు వ్యాప్తి చేశారు.
దీన్ని అవకాశంగా తీసుకుని మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను భారీగా పెంచారు.
కొన్ని ప్రాంతాల్లో సన్న బియ్యం ధర కిలోకు ఏకంగా రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
వివరాలు
ధరలను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు
బియ్యం ధరల పెరుగుదలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
ధరలను అదుపు చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యాన్ని కిలో రూ.66కు, తెలంగాణ సోనాను రూ.74కు, హెచ్‌ఎంటీ రకం బియ్యాన్ని రూ.79కు మించి విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా ప్రతి బియ్యం దుకాణంలో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయించింది.
నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
అధికారులు ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంతో వ్యాపారులు ధరలను తగ్గించక తప్పలేదు.
వివరాలు
ధాన్యం సరఫరా పెరగడంతో..
మరోవైపు కొత్తగా పండించిన ధాన్యం మార్కెట్‌కు ఎక్కువగా చేరుతుండటం కూడా బియ్యం ధరలు తగ్గడానికి దోహదపడింది.
ధాన్యం సరఫరా పెరగడంతో మార్కెట్లో కొరత పరిస్థితులు క్రమంగా తొలగిపోయాయి. ఫలితంగా బియ్యం ధరలు దిగివస్తున్నాయి.
అయితే, బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గుతున్నప్పటికీ ఆన్‌లైన్ విక్రయ వేదికల్లో మాత్రం బియ్యం ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లోనూ ధరలను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరగడంతో గత నెలలో రేషన్ బియ్యానికి డిమాండ్ కూడా పెరిగిందని అధికారులు వెల్లడించారు.