హక్కుల కార్యకర్త, 'నోబెల్' గ్రహీత అలెస్ బియాల్‌యాస్కీకి పదేళ్ల జైలు శిక్ష
బెలారస్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాల్‌యాస్కీకి శుక్రవారం కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నిరసనలు, ఇతర నేరాలకు ఆర్థిక సహాయం చేసిన కేసులో అలెస్‌కు ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అలెస్ బియాల్‌యాస్కీకి కోర్టు శిక్షను విధించినట్లు హక్కుల సంఘాలు ఆరోపించాయి. అలాగే కోర్టు తీర్పుపై బెలారస్ ప్రతిపక్ష నాయకుడు స్వియాట్లానా సిఖానౌస్కాయ అసహనం వ్యక్తం చేశారు. బియాల్‌యాస్కీతో పాటు ఇతర కార్యకర్తలు అన్యాయంగా దోషులుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. దీన్ని భయకరమైన తీర్పుగా అభివర్ణించారు.
2021లో బియాల్‌యాస్కీతో పాటు మరో ఇద్దరు అరెస్ట్
బియాల్‌యాస్కీతో పాటు ముగ్గురు కలిసి నిరసనలకు డబ్బును సమకూర్చినట్లు అధికారులు అభియోగాలు మోపారు. 2020 నుంచి 2021వరకు బెలారస్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం వందలాంది మందిని అరెస్టు చేసి నిర్భందించింది. అందులో ఒకరు వియాస్నా మానవ హక్కుల సంఘం సహ-వ్యవస్థాపకుడైన బియాల్‌యాస్కీ. వియాస్నాకు చెందిన ఇద్దరు సహోద్యోగులతో పాటు 2021లో బియాల్‌యాస్కీ అరెస్టయ్యారు. అలెగ్జాండర్ లుకాషెంకో 2020లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత బెలారస్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి.