Page Loader
Jharkhand: శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Jharkhand: శివరాత్రి సందర్భంగా అల్లర్లు.. హజారీబాగ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివరాత్రి పర్వదినం రోజున జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి. హజారీబాగ్‌లోని డుమ్రౌన్ గ్రామంలో శివరాత్రి డెకరేషన్‌ను కేంద్రంగా చేసుకుని రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడులు చోటుచేసుకోగా, ఆందోళనకారులు పలు వాహనాలు, దుకాణాలను తగలబెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, శాంతిని పునరుద్ధరించేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

Details

డుమ్రౌన్‌లో ఉద్రిక్తత - వాహనాలకు నిప్పు 

హజారీబాగ్ జిల్లా ఇచాక్ బ్లాక్‌లోని డుమ్రౌన్ గ్రామంలో బుధవారం ఉదయం మహాశివరాత్రి వేడుకల సందర్భంగా జెండాలు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. ఈ ఘర్షణ క్రమంగా తీవ్రరూపం దాల్చి హింసకు దారి తీసింది. ఆందోళనకారులు మూడు మోటార్‌సైకిళ్లతో పాటు ఒక కారును తగలబెట్టారు. అంతేగాక ఒక దుకాణాన్ని కూడా దహనం చేశారు. హిందూస్తాన్ చౌక్ వద్ద శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలు, లౌడ్ స్పీకర్లపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఈ వివాదం కాస్తా తీవ్ర రూపం దాల్చి, మతపరమైన ఘర్షణకు మారింది. పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి శాంతిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

Details

కేంద్రమంత్రి సంజయ్ సేథ్ కీలక వ్యాఖ్యలు 

ఈ ఘటనపై కేంద్రమంత్రి, రాంచీ బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ తీవ్రంగా స్పందించారు. జార్ఖండ్‌లో సరస్వతి పూజ, రామనవమి, హోలీ వంటి పండుగల సమయంలో హింసాత్మక సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఇలాంటి ఘర్షణలకు బంగ్లాదేశ్‌ నుంచి చొరబడినవారే కారణమని ఆయన ఆరోపించారు. ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగకుండా హజారీబాగ్‌లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. హింసలో పాలుపంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంకా కొంత ఉద్రిక్తత నెలకొని ఉంది. ఈ ఘటనతో శివరాత్రి పండుగ వేడుకలకు మసక పడగా, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.