
Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 46.60 అడుగులు నమోదు అయింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నీటిమట్టం 48 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వాసులందరికీ అప్రమత్తత సూచనలు ఇవ్వబడ్డాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నదివైపునకు ఎవరూ వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలు
ఎగువ ప్రాంతాల భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద నీరు పోటెత్తింది. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 18.10 మీటర్లకు, పోలవరం వద్ద 11.71 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ అండ్ ఔట్ ఫ్లో 7.99 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. గోదావరి నీటి మట్టం ఇంకా పెరగవచ్చనే అంచనాతో అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పాలేరు, వైరా రిజర్వాయర్లతో పాటు తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీ వరద నీరు చేరింది. మున్నేరుకులో కూడా వరద పరిస్థితులు ఏర్పడటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు సజాగ్రత్తగా అప్రమత్తం చేస్తున్నారు.