
స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
తొలుత కారు అదుపు తప్పి, వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది.
ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 10మంది మూడో సంవత్సర విద్యార్థులు రెండు కార్లలో మారేడుమిల్లికి పయనమయ్యారు. పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించిన విద్యార్థులు శనివారం రాత్రి తిరుగుముఖం పట్టారు.
DETAILS
ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు ప్రాణం విడిచారు
ఈక్రమంలోనే ఓ కారు బూరుగుపూడి వద్ద గల పాత, కొత్త బ్రిడ్జిల మధ్య పంట కాలువలోకి దూసుకెళ్లింది.ఘోర ప్రమాదాన్ని గమనించిన మరో కారులోని స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన తరలివచ్చిన పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. క్రేన్లతో కారును వెలికి తీశారు.
ఈ మేరకు ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్‌లు మరణించినట్లుగా పోలీసులు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కారు అధిక స్పీడ్ కారణంగానే ప్రమాదానికి దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారుపై తెలంగాణ నల్గొండ జిల్లాలో ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు వివరించారు.