విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతికి పొట్టలో భారీగా వెంట్రుకలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ చేసి చుట్టుకున్న వెంట్రుకలను తొలగించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన ఓ యువతి తరుచూ వెంట్రుకలు మింగుతుండేది. అలా అవన్నీ పొట్టలో పేరుకుపోయాయి. ఆ వెంట్రుకలు చుట్టుకుపోయి గొంతు వరకూ వ్యాప్తి చెందాయి. దీంతో బాధితురాలికి ఏమీ తినలేని, తాగలేని దుస్థితికి చేరింది. ఫలితంగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. స్కానింగ్ చేసిన వైద్యులు పోట్టలో ఉన్న వెంట్రుల చుట్టను చూసి ఆశ్చర్యపోయారు. బాధిత యువతికి ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా ఆ వెంట్రల ఉండను తొలగించారు.
వీటిని ట్రైకోబెజార్ అని పిలుస్తారు : విభాగాధిపతి డాక్టర్ కె.అప్పారావు
తొలుత ఎండోస్కోపీ ద్వారా వెంట్రుకలను తొలగించాలని ప్రయత్నించిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులకు అది సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం వైద్యులు డా. దుర్గారాణి, డా. చందన ప్రియాంక, డా.గాయత్రి, డా.ప్రవీణ్ కుమార్ సహా ఎనస్థీషియన్ డా. ఏవీరావు, డా.కిరణ్ బృందంతో కలిసి ఆపరేషన్ చేశారు. ఈ మేరకు పొట్టలో అల్లుకుపోయిన వెంట్రుకలను తొలగించామని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగాధిపతి(HOD) డాక్టర్ కె.అప్పారావు వెల్లడించారు. వెంట్రుకలు గొంతు వరకు వ్యాప్తి చెందడంతో శస్త్ర చికిత్స క్లిష్టంగా మారిందని వివరించారు. ఇలాంటి కేసులు అరుదుగానే ఉంటాయని, వీటిని ట్రైకోబెజార్ అని పిలుస్తారని డా.అప్పారావు చెప్పుకొచ్చారు.