తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలు.. 10 వేలకు చేరువలో మెడికల్ సీట్లు
తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక్కో కళాశాలలో 100 సీట్లు ఉండనున్నాయి. వచ్చే ఏడాది నుంచి నూతన వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు వచ్చినట్టేనని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం నేరవేరుతుందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించేందుకు కొత్త కాలేజీలు దోహదం చేస్తాయన్నారు.