
AP liquor scam: ఏపీ అక్రమ మద్యం కేసులో కీలక మలుపు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌కు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చోటుచేసుకున్న ఈ భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు కొత్త కోణాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుల నివాసాలు,కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు, మొత్తం రూ.11 కోట్ల నగదు 12 బాక్సుల్లో భద్రపరచబడి ఉండగా, వాటిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలానికి చెందిన కాచార్ ప్రాంతంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌస్‌లో ఈ అక్రమ నగదు నిల్వను గుర్తించారు.
వివరాలు
నగదు దాచి ఉంచిన ప్రాంతాలపై దాడులు
ఈ లిక్కర్ స్కామ్‌లో ఏ-40 నిందితుడైన వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు ఈ నగదును పట్టుకున్నారు. వరుణ్ ఇచ్చిన కీలక వాంగ్మూలం సాయంతోనే ఈ నగదు దాచి ఉంచిన ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఈ నగదు సీజ్ ఘటనకు సంబంధించి చాణక్య, వినయ్‌ల పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. సిట్‌కు లభించిన సమాచారంలో ప్రకారం, జూన్ 2024లో రాజ్ కెసిరెడ్డి,చాణక్య ఆదేశాల మేరకు వినయ్ సాయంతో వరుణ్ ఈ రూ.11 కోట్లను 12 అట్ట పెట్టెల్లో ఆఫీసు ఫైళ్ల పేరుతో దాచినట్లు తెలుస్తోంది.
వివరాలు
వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల పాత్రపై కూడా సిట్‌కు అధరాలు
వరుణ్ పురుషోత్తం తన నేరాన్ని అంగీకరించడమే కాకుండా, కీలకమైన నిజాలను బహిర్గతం చేయడంతో ఈ మద్యం స్కామ్‌కు సంబంధించిన భారీ నగదు నిల్వలు బయటపడ్డాయి. ప్రాథమిక విచారణలో సిట్ అధికారులకు లభించిన సమాచారం ప్రకారం, ఈ మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్‌కి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల పాత్రపై కూడా సిట్‌కు ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. మొత్తం ఆధారాలతో త్వరలోనే ఈ స్కాంలో ప్రమేయం ఉన్న కొంతమంది ప్రముఖులు బయటపడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.