Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి రావడంతో బస్సుల్లో రద్దీ పెరిగి, మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సీట్లు కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణను క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా త్వరలోనే ఓఆర్‌ఆర్ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. సోమవారం రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి కాలుష్యాన్ని తగ్గిస్తామన్నారు.
50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
అదే విధంగా రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామన్నారు. రేవంత్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ప్రజలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సేవలను గౌరవప్రదంగా అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదినెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన సందర్భంలో తల్లిదండ్రుల ఆనందం తనకు సంతోషం కలిగించిందని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లాంటి వాడకం నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు.
1.05 లక్షల మంది మహిళలకు లబ్ధి
అలాగే 10 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసినట్టు వివరించారు. మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడం వల్ల 1.05 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని సీఎం తెలిపారు.