
Adani issue: అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. అదానీ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షపార్టీలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో, ఉభయసభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే అదానీ వివాదంపై చర్చ మొదలెట్టాలని విపక్షాలు అడిగాయి. కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో సభ గందరగోళంగా మారింది. ఈ పరిస్థితిని చూసి స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో, చైర్మన్ ధన్‌ఖర్ సభను మధ్యాహ్నం 11:30 గంటలకు వాయిదా వేశారు.
వివరాలు
జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్
ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవడం, ఆ విషయాన్నిఅధికారికంగా విచారించిన న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదు కావడం రాజకీయ,వ్యాపార రంగాల్లో తీవ్ర ఆసక్తిని కలిగించాయి. అదానీ గ్రూప్ సోలార్ పవర్ ప్రాజెక్టులు గెలుచుకోవడం కోసం వివిధ రాష్ట్రాల్లోని అధికారులను 265 మిలియన్ డాలర్లు(రూ. 2,238 కోట్లు)లంచంగా ఇవ్వడాన్ని సంబంధిత కోర్టు నిర్ధారించింది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల మధ్య తీవ్ర చర్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరపాలని,జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ కూడా అదానీ పై చర్చకు దరఖాస్తు చేశారు.దీంతో,సభలో గందరగోళం ఏర్పడింది.