#NewsBytesExplainer: డీసీసీ అధ్యక్షుల నియామకంలో అసంతృప్తి.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రవర్తనపై గుసగుసలు ..
ఈ వార్తాకథనం ఏంటి
ఆదర్శవంతంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. అయితే... తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రవర్తనను గురించి పార్టీకి చెందిన నాయకులే గుసగుసలాడుతున్నారు. ఆమె మాటలు, ఆమె చేసే పనులు రెండు వేర్వేరు అని చాలా మంది అంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే.. ఆమె ప్రవర్తన ఇప్పుడు కొరకరాని కొయ్యలా మారిందన్న చర్చ జరుగుతోంది. గాంధీభవన్‌లో,స్థానిక నేతలతో ఏకంగా సంబంధం లేకుండానే, ఏమీ చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివరాలు
గాంధీభవన్ గోడలకు గోడు
ఆమె ఏం చేశారంటూ విచారించడం, విషయం తెలిసి గొణుకోవడం, అది కాకపోతే... గాంధీభవన్ గోడలకు గోడు వెళ్ళబోసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామంటూ కొందరు నాయకులు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. కొందరు నాయకులు చొరవ తీసుకుని "సార్, ఇది ఏమిటి? ఇలా ఎందుకు చేస్తున్నారు?"అని ప్రశ్నించినా, రాష్ట్ర నేతలు"మనం చేయగలది ఏమిటి? అంతా మేడమే"అని సమాధానం ఇస్తున్నారని వర్గాల సమాచారం. ముఖ్యంగా, డీసీసీ అధ్యక్షుల నియామకానికి ముందు, మీనాక్షి నటరాజన్ చాలా విషయాలను పార్టీ నేతలకు చెప్పారు. కానీ, ఆ మాటలు, జరిగిన దానికి అసలు సంబంధం లేదని తాజా వాదన. పార్టీకి లాభం ఉంటే ఏది చేయాలో నిర్ణయిస్తే సరిపోతుంది. కానీ నియామకానికి ముందు పెద్ద డైలాగులు చెప్పడం ఎందుకు అనేది నేతల ప్రశ్న.
వివరాలు
ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్స్‌కి కూడా డీసీసీ పీఠాలు
పార్టీలో ఒకరికి ఒకే పదవి అన్నారు. ఒక పోస్టు ఉంటే ఇంకోరికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇది ఆయనను మంత్రి పదవి రేస్ నుంచి బయట ఉంచడానికి తీసుకున్న వ్యూహమా అని కూడా చర్చ జరుగుతోంది. అలాగే.. ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్స్‌కి కూడా డీసీసీ పీఠాలు దక్కాయి. పాత DCC అధ్యక్షులకు తిరిగి పదవి ఇవ్వబోమన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించారు. ఎమ్మెల్యే కాని నేతల్లో మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాల అధ్యక్షులను కొనసాగించారు. అలాగే, పీసీసీ కమిటీలో ఉన్న వారికీ పదవులు దక్కాయి. ఆరుగురు జనరల్ సెక్రటరీలు,ముగ్గురు ఉపాధ్యక్షులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు.
వివరాలు
మైనార్టీ నేతల ఫిర్యాదు
నాయకుల కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వకూడదని కూడా మీనాక్షి స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ, సిద్ధిపేట పగ్గాలు మాజీ DCC అధ్యక్షుడు నర్సారెడ్డి కూతురికి, మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే భార్యకు డీసీసీ పీఠం దక్కింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడి ఎక్కడి నుండి వచ్చారన్నది పార్టీలో ఎవరికీ అంతుచిక్కడం లేదట. కర్నూలు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకు ఇచ్చారని మైనార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. జనగామ జిల్లాను ఆశించిన జంగా రాఘవ్ రెడ్డి నారాజ్‌లో ఉన్న విషయంపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఐదేళ్ల కాలం పార్టీలో ఉంటేనే పదవి ఇస్తామని చెప్పి...పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చి పోటీ చేసిన ఆత్రం సుగుణకి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి
వివరాలు
ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోవడం వల్ల పార్టీ నేతల్లో అసంతృప్తి
ఈ విధంగా, డీసీసీ అధ్యక్షుల నియామకంలో మొత్తం అస్తవ్యస్తంగా నడిచిందని, రాష్ట్ర ఇన్ఛార్జ్ స్థాయిలో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినా, దానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల పార్టీ నేతల్లో అసంతృప్తి భావన మిగిలిపోయింది. ఒకవేళ వీలవకుంటే... ముందు భారీ డైలాగులు చెప్పి బిల్డప్‌లు ఇవ్వడం ఎందుకన్నది వాళ్ళ ప్రశ్న .