Rythu bharosa: సీఎం ఆదేశాలతో.. 17 లక్షల మంది ఖాతాల్లో రైతుభరోసా జమ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకూ సాగు భూములు కలిగిన రైతులకు బుధవారం నిధులు విడుదలయ్యాయి.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 17.03 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకం ప్రారంభమై, తొలి విడతగా జనవరి 27న నిధులు పంపిణీ చేశారు.
రెండో విడతలో భాగంగా బుధవారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా చిన్నతరహా భూములకు నిధులు విడుదల చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు ఆయా రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేశారు.
వివరాలు
మొత్తం రూ.1,126.54 కోట్లు జమ: మంత్రి తుమ్మల
జిల్లాల వారీగా చూస్తే,అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.55లక్షల మంది రైతులకు,సిద్దిపేటలో 1.20లక్షల మందికి,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరో 1.15లక్షల మందికి, కామారెడ్డిలో 1.09లక్షల మందికి, ఖమ్మంలో 1.04లక్షల మందికి నిధులు అందినట్లు పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం అమలులో భాగంగా జనవరి 27 నుంచి బుధవారం వరకు మొత్తం 21,45,330 మంది రైతుల ఖాతాల్లో రూ.1,126.54కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నిధులను విడుదల చేస్తామని తెలిపారు.
ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా రూ.7,625 కోట్లు, రుణమాఫీ కోసం రూ.20,616.89 కోట్లు,అలాగే రైతు బీమా కోసం రూ.3,000కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు.
వివరాలు
రూ.406 కోట్లతో దిగుబడి కొనుగోళ్లు
సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా రూ.406.24 కోట్ల విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు.
యాసంగిలో రూ.10,547 కోట్ల వ్యయంతో 48.06 లక్షల టన్నుల వరి, వానాకాలంలో రూ.12,178.97 కోట్లతో 52.51 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని వివరించారు.
ఇందులో భాగంగా, సన్న ధాన్యానికి ప్రత్యేకంగా రూ.500 బోనస్ కింద ప్రభుత్వం రూ.1,154 కోట్లు చెల్లించింది. ఈ యాసంగి సీజన్‌లో కూడా బోనస్ కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
వివరాలు
పత్తి సేకరణ గడువు పొడిగింపు అవసరం
తెలంగాణలో పత్తి పంట పూర్తిగా సేకరించేందుకు మరింత గడువు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
అంతేకాకుండా, పసుపు, మిరప పంటలకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు పేర్కొన్నారు.