నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య
భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశమవనున్నారు. అయితే ఈ భేటీలో ఎజెండా గురించి స్పష్టంగా పేర్కొనలేదు. అమెరికా మిత్రదేశాలు భారత్, కెనడా మధ్య కొనసాగుతున్న వివాదంపై చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత జూన్‌లో కెనడా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య నేపథ్యంలో కెనడా- భారత్ మధ్య దౌత్యపరమైన వివాదాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్ నేడు వాషింగ్టన్‌లో ఆంటోనీ బ్లింకెన్‌ను కలవనున్నారు. గతవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNITED NATIONS GENERAL ASSEMBLY) సెషన్‌లో జైశంకర్, బ్లింకెన్ సమావేశమయ్యారు.
దౌత్య సంక్షోభంపై అక్కడ చర్చలు జరగలేదు : యూఎస్
కానీ భారత్-కెనడా దౌత్య సంక్షోభంపై ఇందులో చర్చలు జరగలేదని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఇద్దరు నేతల మధ్య జరగనున్న సమావేశంలో చర్చించనున్న అజెండాలోని నిర్దిష్ట అంశాలను వెల్లడించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ నిరాకరించారు. నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తునకు సహకరించాలని అమెరికా భారత్‌ను కోరిందన్నారు. ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉండొచ్చని కుండ బద్దలు కొట్టిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలపై దుమారం ఇంకా ఆగలేదు. మరోవైపు ఈ అంశంపై మంగళవారం UN సభలో భారత విదేశాంగ మంత్రి స్పందించారు. ఈ మేరకు తమ దేశ అంతర్గాత వ్యవహారాల్లో ఇతర దేశాలు కలగజేసుకోకూడదని అల్టిమేటం ఇచ్చేశారు.