Telangana: ధూల్‌పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ హంగామా మొదలైంది. హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. పండుగ సమీపిస్తున్నందున ధూల్‌పేట నుండి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాల సరఫరా జరుగుతోంది. ధూల్‌పేటలో గణేశ్ విగ్రహాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ప్రజలు,గణేశ్ఉత్సవ కమిటీల నిర్వాహకులు క్యూ కడుతున్నారు. ధూల్‌పేటలో వీధులన్నీకొనుగోలుదారులతో నిండిపోయాయి. వినాయక చవితి సమీపిస్తుండడంతో గణేశ్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు విగ్రహాలు కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఇక్కడ 2 ఫీట్ల నుంచి 40 ఫీట్ల దాకా విభిన్న పరిమాణాలు, రూ.100 నుంచి రూ.5 లక్షల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.
రకరకాల థీమ్‌లతో విగ్రహాలు
ధూల్‌పేట్‌లో 3 నెలల క్రితమే వినాయక విగ్రహాల విక్రయాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో ఈ సంవత్సరం రకరకాల థీమ్‌లతో విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. రామ్‌లల్లా, శివాజీ గణేశ్, గరుడ గణేశ్, మహారాష్ట్ర ఫేమస్ గణేశ్ వంటి ప్రత్యేక ప్రతిమలు అందుబాటులో ఉన్నాయి. ధూల్‌పేటలో గణపతి విగ్రహాల తయారీకి మునుపటికంటే ఎక్కువగా కళాకారులను పిలిపించి తయారీని పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది, కాని మార్కెట్‌లో వీటి లభ్యత తక్కువగా ఉండటంతో ప్రజలు ఇంకా ఇతర ప్రతిమల వైపు మొగ్గు చూపుతున్నారు.
రెడీ అవుతున్న బాలాపూర్ గణనాథుడు
వ్యాపారుల ప్రకారం,ఇప్పటివరకు 70 శాతం విగ్రహాలు అమ్ముడుపోయాయి, చాలా మంది ఇప్పటికే అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నారు. గణేశ్ మండపాల్లో ప్రతిష్ఠించడానికి విగ్రహాలు కొనుగోలు చేసిన వెంటనే తరలింపు జరుగుతోంది. బాలాపూర్ గణేశుడి నమూనాలను కోరుకునేవారూ ఉన్నారు.ఈ థీమ్ విగ్రహాలు 7 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంటున్నాయి, వీటిని రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అమ్ముతున్నారు. తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత, బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఏటా ఏర్పాటు చేసే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి, అందువల్ల, బాలాపూర్ తరహా విగ్రహాలు కావాలని చాలా మంది పట్టుబడుతున్నారు.