Nadendla Manohar: ఉదయం కొనుగోలు.. సాయంత్రానికి నగదు జమ
ఈ వార్తాకథనం ఏంటి
ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందులో భాగంగా రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.9,800కోట్లను 24గంటల లోపే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రం నాటికి నగదు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రబీ ధాన్యం కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సోమవారం ఉదయం విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వివరాలు
ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు
ఈ సందర్భంగా తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొలిసారిగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యాన్ని తరలిస్తున్నామని తెలిపారు. తేమ శాతం, జీపీఎస్ పర్యవేక్షణ, రవాణా వంటి సమస్యలను సమర్థంగా పరిష్కరించగలిగామని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. రబీ సీజన్‌లోనూ గోతాలు, రవాణా, నిల్వ సౌకర్యాల విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.