'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు
భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది. స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన కేంద్రం తీరును భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తప్పుబట్టారు. స్వలింగ వివాహాలు పట్టణ ఉన్నతవర్గాల కాన్సెప్ట్ అని కేంద్రం వాదించడాన్ని సీజేఐ వ్యతిరేకించారు. పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు స్వేచ్ఛగా గది నుంచి బయటకు వస్తున్నందున స్వలింగ వివాహాలు ఎక్కువ అర్బన్ ప్రాంతాల్లో జరుగుతుండొచ్చని సీజేఐ అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహాలు అర్బన్ కాన్సెప్ట్ అనే దాని హేతు బద్ధత ఏంటని, ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా లేదన్నారు.
మరో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం; రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లను విచారిస్తోంది. స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను భాగస్వాములను చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషన్ల తీర్పు కోసం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు అవసరమని కేంద్రం ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ క్రమంలో స్వలింగ వివాహాల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 10రోజుల్లోగా తమ అభిప్రాయాలను పంపాలని ధర్మానసం కోరింది.