Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?
భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్వలింగ వివాహాలను మొదట ఏ దేశం చట్టబద్ధం చేసింది? ఎన్ని దేశాల్లో ఈ వివాహాన్ని గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రపంచంలోనే మొట్ట మొదట గుర్తించిన దేశం డెన్మార్క్. ఆరుగురు స్వలింగ సంపర్కులు అక్టోబరు 2, 1989న 'రిజిస్టర్డ్ పార్టనర్‌షిప్'లో భాగంగా వివాహం చేసుకున్నారు. వివాహిత భిన్న లింగ సంపర్కులుగా వీరికి డెన్మార్క్ ప్రభుత్వం అనేక హక్కులను కల్పించింది. అయితే పిల్లలను దత్తత తీసుకునే హక్కు లేదు.
మొదట చట్టం చేసింది మాత్రం నెదర్లాండ్స్
స్వలింగ వివాహాన్ని అధికారికంగా మొదటగా గుర్తించిన దేశం మాత్రం నెదర్లాండ్స్. డిసెంబర్ 2000లో స్వలింగ వివాహాలను గుర్తిస్తూ డచ్ పార్లమెంట్ బిల్లును ఆమోదించింది. ఈ చట్టంలో స్వలింగ సంపర్కులకు అన్ని హక్కులను కల్పించారు. ఈ చట్టం స్వలింగ జంటలు వివాహం చేసుకోవడానికి, విడాకులు తీసుకునే, పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఇచ్చింది. ఏప్రిల్ 1, 2001లో నలుగురు స్వలింగ జంటలు వివాహం చేసుకోవడం ద్వారా ఈ చట్టం నెదర్లాండ్స్‌లో అమలులోకి వచ్చింది. అ తర్వాత వేలాది స్వలింగ జంటలు నెదర్లాండ్స్‌లో వివాహం చేసుకున్నాయి. అప్పటి వరకు స్వలింగ వివాహాలకు అనుతించిన డెన్మార్క్, 2012లో ఆ పెళ్లిళ్లను చట్టబద్ధం చేసింది. స్వలింగ జంటలు పౌర వేడుకలు, మతపరమైన వేడుకలు రెండింటిలోనూ వివాహం చేసుకోవడానికి అనుమతించింది.
34 దేశాల్లో స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు
స్వలింగ వివాహాలను ఇప్పటి వరకు 34 దేశాలు చట్టబద్ధం చేశాయి. 2003లో బెల్జియం స్వలింగ వివాహాలను అనుమతించింది. 2006లో ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. 2005లో స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవచ్చని కెనడా, స్పెయిన్ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించింది. దక్షిణ ఆఫ్రికా, నార్వే, స్వీడన్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్ లాండ్, ఉరుగ్వే, బ్రెజిల్, న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్, స్కాట్లాండ్, లక్సెంబర్గ్, అమెరికా, ఐర్లాండ్, ఫిన్ లాండ్, గ్రీన్ లాండ్, కొలంబియా, మాల్ట్రా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఆస్ట్రీయా, తైవాన్, ఈక్వెడార్, ఐర్లాండ్, కోస్టా రికా, స్విట్జర్లాండ్, చిలీ, స్లోవేనియా, అండోరా, క్యూబా దేశాల్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది.